
శ్రీనగర్, 04 మార్చి (హి.స.)
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా కాశ్మీర్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఖమేనీ మృతితో సోమవారం వెల్లువెత్తిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది సహా 14మంది గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీనగర్‌తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించిన ప్రభుత్వం, శాంతి భద్రతలను పర్యవేక్షిస్తోంది. ఆంక్షల కారణంగా వ్యాపార సముదాయాలు మూతపడటంతో పాటు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌లోని అన్ని విద్యాసంస్థలను మార్చి 7వరకు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలపై పరిమితులు విధించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు