
నంద్యాల, 13 ఏప్రిల్ (హి.స.)నంద్యాల జిల్లాలో ఎండలు ముదురుతున్న వేళ ఊహించని అగ్నిప్రమాదాలు రైతన్నల కడుపు కొడుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం స్థానిక రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ప్రమాదంలో సుమారు 20 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఏడాది పొడవునా పశువుల కోసం దాచుకున్న పశుగ్రాసం కళ్లముందే బూడిద కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
బత్తలూరు గ్రామ శివార్లలోని గడ్డివాముల వద్ద ఈరోజు(సోమవారం) ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి కాలం కావడంతో గాలుల తీవ్రతకు మంటలు క్షణాల్లో ఓ వాము నుంచి మరో వాముకు వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, మంటల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ