
తాండూరు, 13 ఏప్రిల్ (హి.స.)
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని తట్టెపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పెద్దేముల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామానికి చెందిన పావని (35), ఆమె భర్త కవిరాజ్ (40) జహీరాబాద్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కీర్తన (11), కార్తీక్ (13). మే ఒకటో తేదీన పావని సోదరుడి వివాహం నేపథ్యంలో.. ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నుంచి రుక్మాపూర్ గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పావని, కవిరాజ్, కీర్తన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు కార్తీక్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ