
అమరావతి, 13 ఏప్రిల్ (హి.స.)
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ తుది విడత పేపర్ -1 ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ శనివారం రాత్రి విడుదల చేసింది. ఇందులో నూజండ్ల మండలం సాయినగర్కు చెందిన బిజ్జం వెంకట చంద్రశేఖరరెడ్డి 300కు 300 మార్కులు సాధించాడు. ఈ పరీక్షకు సుమారు 10.28 లక్షల మంది హాజరయ్యారు.
‘రోజుకు 14 గంటలపాటు చదివా. ఆ కష్టానికి ఫలితమే జేఈఈ మెయిన్ ప్రాథమిక కీలో 300కు 300 మార్కులు సాధించినట్లు విద్యార్థి వెంకట చంద్రశేఖరరెడ్డి తెలిపాడు. మొదటిసారి జనవరిలో పరీక్ష రాయగా 257 మార్కులు వచ్చాయని, రెండోసారి అనుకున్నట్లుగానే వందశాతం మార్కులు కీలో రావడం ఆనందంగా ఉందన్నాడు.
తల్లిదండ్రులు రమణారెడ్డి, సుధాభారతిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు. పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. కుమారుడు చంద్రశేఖర్రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం సాయినగర్ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేశాడు. నవోదయ పరీక్షలో 30వ ర్యాంకు సాధించగా.. విజయవాడలోని కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థ ఇతడి ప్రతిభను గుర్తించి ఉచిత సీటు ప్రకటించి 10 వరకు చదివించింది. పదో తరగతిలో 568 మార్కులు సాధించడంతో శ్రీచైతన్య కళాశాలలోనూ ఉచితంగా చేర్పించుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 470కు 458 మార్కులు సాధించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ