
అనంతపురం, 13 ఏప్రిల్ (హి.స.) అనంతపురం జిల్లా విద్యార్థిని రూపొందించిన నమూనా ప్రాజెక్టును గుర్తించిన జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం తమ దేశానికి ఆహ్వానించింది. గుంతకల్లు మండలం కసాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని కావలి జ్యోతి ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ అనే నమూనా ప్రాజెక్టు రూపొందించింది. ఇది మనాక్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్రం నుంచి ఎంపికైన ఐదు ప్రాజెక్టులకు సకుర కార్యక్రమం కింద జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యంగ్ టాలెంట్స్కు సైన్స్, నాలెడ్జ్ షేరింగ్కు అవకాశం కల్పించింది. ఈ టెంట్తో అనేక ఉపయోగాలున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో చంటి బిడ్డలకు తల్లులు పాలు పట్టాలంటే ఇబ్బంది ఉంటుంది. ఈ టెంట్లో తెరచాటున పాలు పట్టవచ్చు. విహారయాత్రలకు వెళ్లినప్పుడు రాత్రి వేళల్లో బస చేయడానికి గదులు అందుబాటులో లేకపోతే టెంట్లో నిద్రించవచ్చు. టెంట్ పైనున్న సోలార్ సెల్ ద్వారా లోపల ఎల్ఈడీ బల్బులు వెలగడంతో పాటు పంకా తిరుగుతుంది. ఉపాధ్యాయుడు నారాయణ ప్రోత్సాహంతో జ్యోతి దీన్ని తయారు చేసింది. ప్రస్తుతం జ్యోతి ఇడుపులపాయలో ఇంటర్మీడియట్ చదువుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ