
అమరావతి, 18 ఏప్రిల్ (హి.స.)దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాల తీరు వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం రాష్ట్రాల మధ్య లోక్సభ స్థానాల పంపిణీ ప్రస్తుతం ఫ్రీజ్లో (నిలుపుదల) ఉందని లోకేశ్ గుర్తుచేశారు. ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్లులు అమలులోకి రాకపోతే.. 2026 జనగణన తర్వాత కేవలం జనాభా ప్రాతిపదికన స్థానాలను నిర్ణయించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కుటుంబ నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది పెను శాపంగా మారుతుందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ఫెడరల్ సమతుల్యతపై నేరుగా దాడి చేయడమే అని విమర్శించారు. జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకు ఎక్కువ రాజకీయ బలం చేకూరి, బాధ్యతగా వ్యవహరించిన రాష్ట్రాలు నష్టపోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రక తప్పిదానికి ప్రతిపక్ష పార్టీలే బాధ్యత వహించాలని మంత్రి లోకేశ్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV