
చెన్నై, 18 ఏప్రిల్ (హి.స.)తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు చేశారు. నటుడి సినిమా చూసి విజిల్స్ వేయొచ్చని, కానీ రాష్ట్రాన్ని మాత్రం వారికి అప్పగించలేమని పేర్కొన్నారు. దిండుక్కల్ జిల్లా పళనిలో డీఎంకే కూటమిలోని సీపీఎం అభ్యర్థి ఎన్. పాండికి మద్దతుగా గురువారం రాత్రి జరిగిన ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. సినిమాలో ఒకే పాటలో డాక్టర్, ఇంజినీర్, ముఖ్యమంత్రి అయిపోవచ్చు. కానీ వాస్తవంలో తమిళనాడుకు భాష, ప్రజలు, ఆత్మగౌరవం విషయంలో సమస్యలు వచ్చినప్పుడు మీరెక్కడ ఉన్నారు? అని విజయ్ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. అభిమానులు ఎండలో నిలబడి, కటౌట్లు కట్టి చూపించిన ప్రేమను రాజకీయ ప్రవేశానికి వాడుకోవడం సరికాదన్నారు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ ప్రేమ వేరు, ఈ బాధ్యత వేరు అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నవి ద్రావిడ మోడల్, బానిస మోడల్, సినిమా మోడల్ మధ్య ఎన్నికలని ప్రకాశ్ రాజ్ అభివర్ణించారు. ద్రావిడ మోడల్ విద్యను, భాషను కాపాడితే.. బానిస మోడల్ రాష్ట్ర గౌరవాన్ని ప్రధాని మోదీ పాదాల వద్ద తాకట్టు పెడుతోందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi