
జగిత్యాల, 03 ఏప్రిల్ (హి.స.)
'రెండేళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి పోవాలి.. మార్పు రావాలి' అనే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కేసీఆర్ పోయి మార్పు రావాలనే నినాదంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి పాలన పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన పెద్దాయన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం జగిత్యాలలోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇంతకాలం పార్టీలో తన అడ్డు తొలగించుకునేందుకే నామినేటెడ్ పదవుల్లో జాప్యం చేశారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న విమర్శలు రాజకీయ కోణంలో మాత్రమే ఉన్నాయని.. కానీ పునరుద్ధరణ పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి సీ. ఆర్. పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు మొత్తం ప్రాజెక్ట్లో చిన్న భాగమేనని తెలిపారు. ఈ మూడు బ్యారేజీలను పునరుద్ధరించడానికి సుమారు రూ.500 కోట్లలోపే ఖర్చవుతుందని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చినా అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రాణహిత నది జలాలను వినియోగించుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం సరైన డిజైన్ కూడా రూపొందించలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు జీవనాధారమని, హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మూసి ప్రక్షాళన అన్నీ దీనిపైనే ఆధారపడుతున్నాయని చెప్పారు.
మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకపోతే దాదాపు 18 లక్షల ఎకరాల సాగు భూమి, హైదరాబాద్ అవసరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులు తెలంగాణ అనుకూలంగా లేకపోతే ఎడారిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణను తక్షణమే చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తెలంగాణ సమాజం క్షమించదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు