
అనంతపురం, 03 ఏప్రిల్ (హి.స.)మిరప రైతుల కష్టాలు తీరడం లేదు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉన్నప్పుడు దిగుబడి ఉండదు. దీంతో సాగు చేసిన రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఉరవకొండ నియోజకవర్గంలో పుష్కర కాలం నుంచి మిరప సాగు గణనీయంగా పెరిగింది. హెచ్చెల్సీ, జీబీసీ, హంద్రీనీవా కాలువలతో పాటు బోరుబావుల కింద సుమారుగా 30వేల ఎకరాల్లో మిరపసాగు అయ్యింది. ఈ ఏడాది ఇప్పటికే 80శాతం పైగా పంట రైతుల చేతికి వచ్చింది. నల్లతామర, తెగుళ్లతో పాటు, మొంథా తుఫాన్ కూడా దిగుబడిపై ప్రభావం చూపింది.
నవంబరు, డిసెంబరు నెలలో అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటను కాపాడుకునేందుకు రైతులు రోజు మార్చి రోజు మందులను పిచికారీ చేశారు. దీంతో ఖర్చు తడిసి మోపెడయ్యింది. మూడు నెలల కిందట డబ్బీ రకం క్వింటా రూ.85వేలు పలకగా ప్రస్తుతం రూ.55వేల నుంచి, రూ.65వేల మధ్య నడుస్తోంది. దిగుబడిని విక్రయించేందుకు రైతులు పొలాల్లోనూ, మార్కెట్ యార్డులో నిల్వ చేసుకుని వ్యాపారుల కోసం ఎదురుచూస్తున్నారు.
మంచి ధర వచ్చే వరకు పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేక రైతులు పొలాల్లో చెట్ల కిందే రాశులుగా పోశారు. సాధారణంగా మిరప దిగుబడులను శీతల గిడ్డంగులలో నిల్వ చేయాలి. అలాంటి సదుపాయం జిల్లాలో ఎక్కడా లేదు. ఒక వేళ నిల్వ చేయాలంటే బ్యాడిగి, బళ్లారి, గుంటూరు ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. అదంతా మరింత వ్యయప్రయాసలతో కూడిన పని. జిల్లాలోనే ఏదో ఒక మార్కెట్లో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్