
Telangana, 03 ఏప్రిల్ (హి.స.)
హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో స్థలాల లభ్యత ఉన్నచోట ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల కోసం స్టిల్ట్+9, స్టిల్ట్+5, జీ+3 అంతస్థుల్లో అపార్ట్మెంట్లు నిర్మించాలని హౌసింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎకరానికి స్టిల్ట్+9 అంతస్థుల్లో 200-220 ఫ్లాట్లు, స్టిల్ట్+5 అంతస్థుల్లో 150-200, జీ+3 విధానంలో 120-150 ఫ్లాట్లు నిర్మించి ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సుమారు 415-500 చదరపు అడుగుల మధ్యలో రెండు పడకల గదుల ఇళ్లు ఉండేలా ఆకృతులను రూపొందించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 5 మురికి వాడలను, వాంబే, ఈడబ్ల్యూఎస్ పథకాల కింద నిర్మించి శిథిలావస్థకు చేరిన మరో 12 కాలనీలను గుర్తించారు.
మేడ్చల్ జిల్లాలో 28 ప్రాంతాల్లో సర్కారు స్థలాలను గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇక్రిశాట్ వద్ద 5 ఎకరాలు, మార్క్స్ నగర్లో ఆరు ఎకరాలు, లక్డారంలో 130 ఎకరాల్లో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 77.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చాలా వరకు ఇళ్లకు అర్హత ఉండి, స్థలాలు లేని దరఖాస్తుదారులు 2.14 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షలను మంజూరు చేస్తోంది. ఇప్పుడు ఎల్-2 జాబితాలోని పేదల కోసం అపార్ట్మెంట్లు కట్టి, ఫ్లాట్లను కేటాయించనుంది.
నగరంలో పేదల గల్లీల్లో సర్కారు ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మాణం చేపట్టనుంది. గతంలో కేటాయించిన వాంబే, ఈడబ్ల్యూఎస్ ఇళ్ల సముదాయాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను కూలగొట్టి అక్కడ జీప్లస్+3 పద్ధతిలో నిర్మిస్తారు.
గృహప్రవేశాలకు సిద్ధమైన ఇందిరమ్మ ఇళ్లు :
మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వారికి గృహప్రవేశాలకు రంగం సిద్ధమైంది. వీరంతా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నూతన గృహాల్లోకి అడుగుపెట్టే విధంగా గృహనిర్మాణ శాఖ ఏర్పాట్లు ముగిశాయి. ఏప్రిల్ 1వ తేదీన 4,100 మంది ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల చివరి నాటికి మొత్తం 33 వేల మంది లబ్ధిదారులు నూతన ఇళ్లలోకి మారనున్నారు. మే ఆఖరిలోగా 60 వేలకు చేరుకునే విధంగా ప్లాన్ చేసి ఆ తర్వాత మరో 40 వేల ఇళ్లను జూన్లో మంజూరు చేయడానికి నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi