
సిద్దిపేట, 03 ఏప్రిల్ (హి.స.) ఇసుక సరఫరా ప్రక్రియ వేగవంతంగా అవినీతి రహితం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మన ఇసుక వాహనం పథకాన్ని ప్రవేశపెట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకంలో పౌరులు స్వయంగా ఆన్ లైన్ లో ఇసుక కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా tgmiv.cgg.gov.in వెబ్ సైట్ లో బుక్ సాండ్ ఆప్షన్ క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా అవసరమైన వివరాలు నమోదు చేయాలన్నారు.
అవసరమైన ఇసుక పరిమాణం, డెలివరీ చిరునామా ఇతర వివరాలు నమోదు చేసి, దరఖాస్తు సమర్పించిన తర్వాత చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత మీ ఆర్డర్ స్థితిని వెబ్ సైట్ లో ట్రాక్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ పరిశీలించి కోరిన ఇసుక పరిమాణాన్ని మంజూరు చేస్తారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు సాఫ్ట్ వేర్ చార్జీలు రూ.12 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యక్తి గత గృహ వినియోగ దారులు, ప్రభుత్వ పనులు, ఇతర అవసరాల కోసం ఇసుక బుక్ చేసుకునే వారు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఇసుక రేట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు