
హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్రంలో ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ వసూలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
గత ప్రభుత్వం రద్దు చేసిన వినోదపు పన్నును పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగానే డేటా సేకరణ, వినోదపు పన్ను విధించడానికి సాధ్యాధ్యాలను పరిశీలించడానికి సీఎస్ అధ్యక్షతన ఇప్పటికీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే గతంలో టికెట్ల ఆధారంగా థియేటర్ల నుంచి వినోదపు పన్ను వసూలు చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వినోదపు పన్ను వసూలు చేయడానికి కావాల్సిన విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. థియేటర్లతోపాటు అమ్యూజింగ్ పార్కులు, ప్రభుత్వం గుర్తించిన ఇతర కార్యక్రమాలకు సైతం వినోదపు పన్ను వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న అవకాశాలను పరిశీలించడంతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను సైతం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని థియేటర్లలోని టికెట్ల అమ్మకాలకు సంబంధించిన డేటా సేకరణకు స్టీరింగ్ కమిటీ చర్యలు తీసుకోనుందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం సినిమా థియేటర్ల 450 నుండి 570 వరకు (సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లు) ఉన్నట్లు అంచనా. అయితే థియేటర్ల నిర్వహణ ఖర్చులు, తక్కువ ప్రేక్షకుల ఆదరణ కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ 2026 నాటికి, హైదరాబాద్లోనే 241 థియేటర్లు ఉన్నట్లు సమాచారం. థియేటర్లను కాపాడుకునేందుకు, ఏప్రిల్ 2026 నుండి ఫిక్స్ డ్ రెంట్ బదులు పర్సంటేజ్ (రెవెన్యూ షేరింగ్) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మొదటి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం వసూళ్లలో 50 శాతం, మూడో వారం వసూళ్లలో 40 శాతం వాటాను ఏప్రిల్ 3 నుంచి అమలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు