
హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)
కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధం అని ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందన్నారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్రకు తెరలేపి ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? లేక కావాలనే చేస్తున్న కుట్రనా? అని నిలదీశారు.
భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవి, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని హరీశ్ రావు హెచ్చరించారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం, డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు