రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత
దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు
Kavitha


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్రెడ్డి నిలబడే మాట్లాడుతున్నారని.. లేదంటే తన కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నారని సెటైర్లు గుప్పించారు. ఈరోజు(బుధవారం) తెలంగాణ జాగృతిలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు చేరారు. కండువా కప్పి జాగృతిలోకి కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.

రాసి పెట్టుకోండి.. తెలంగాణ భవిష్యత్, చరిత్రను మార్చే రోజు ఏప్రిల్ 25 అవుతోందని కవిత ఉద్ఘాటించారు. కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. పప్పన్నం తింటాం, ప్రజల మధ్యలో ఉంటామని.. వారితోనే కలిసి పనిచేస్తామని మాటిచ్చారు. సామాన్యులతో, సామాన్యుల కోసం, సామాన్యులే ఉండేలా రాజకీయం తెస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేదెవరు అంటే ప్రతినోట జాగృతియే అనే మాట వస్తోందని చెప్పారు.

తెలంగాణ జాగృతి తరఫున వచ్చే పార్టీ.. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందని భరోసా కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నానని చెప్పుకొచ్చారు. కొత్త తరహా రాజకీయాలు, ప్రజల కోసం మంచి చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తామని కవిత పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande