మత్తు పదార్థాలపై నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సర్జికల్ స్ట్రైక్..
గాంజీ గస్తీ పేరిట వినూత్న కార్యక్రమం చేసిన కలెక్టర్
Nirmal SP


నిర్మల్, 08 ఏప్రిల్ (హి.స.)

నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల గాంజా గస్తీ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు యువత మత్తుకు బానిసలు అవుతున్నారన్న సమాచారం మేరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ మొదలైంది. యువత ఇటీవలి కాలంలో ఎక్కువగా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు మందులకు వ్యసనపరులుగా మారుతున్న కారణంగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అంతట తనిఖీలు ముమ్మరం అయ్యాయి. అయితే నిర్మల్ జిల్లాలో మాత్రం ఇక్కడి ఎస్పీ జానకి షర్మిల గంజాయి అమ్మకాలతో పాటు అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు గాంజా వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గాంజా వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా గాంజా గస్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు రోజులుగా ఏకకాలంలో ఎక్కడికక్కడ గంజాయి అమ్ముతున్నారన్న అనుమానిత ప్రదేశాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడులు ప్రతిరోజు కొనసాగించాలని గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసుల ప్రాధాన్యం పెంచాలని ఎస్పి తీసుకున్న నిర్ణయం కారణంగా గట్టి నిఘా పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణాపై కూడా బస్టాండులు, బస్ స్టాప్లలో కూడా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.హెచ్.ఓ లు, పోలీస్ సిబ్బంది కిరాణా దుకాణాలు, పాన్ దుకాణాలు,అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజలకు గాంజా వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

గాంజా, మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. ముఖ్యంగా యువత గాంజా వంటి మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే ఎవరైనా గాంజా విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ డా.జి.జానకి షర్మిల వెల్లడించారు. పోలీసులు గంజాయి పై చేపడుతున్న తనిఖీలను కొనసాగించాలని బాధిత కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా గంజాయి దొరకకుండా చేస్తే యువత పెడదోవ పట్టిన విద్యార్థులు, యువతలో మార్పు వస్తుందని, ఆ తర్వాత మత్తు వదిలించేందుకు డీ అడిక్షన్ సెంటర్లలో చేర్చడం ద్వారా వ్యసన పరులకు కొత్త భవిష్యత్తు అందించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande