
విజయవాడ, 08 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రవాణా, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడల వికాసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. లోకేశ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్ర ప్రదేశ్ కావడం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియాన్ని (ఏజీఎంసీ) వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ద్వారా రూ.20 కోట్లు, శాప్ ద్వారా మరో రూ.20 కోట్లు.. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.160 కోట్లను మూడు దశల్లో ఖర్చు చేయనుందని మంత్రి మండిపల్లి తెలిపారు. విజయవాడకు తలమానికంగా నిలిచిన ఈ స్టేడియం గత ప్రభుత్వ పాలనలో ఐదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైందని మంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం ఎంపీ కేశినేని శివనాథ్ నాయకత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, శాప్ సమన్వయంతో దీని అభివృద్ధికి జీవో తీసుకురావడం జరిగిందని చెప్పారు. విజయవాడ స్టేడియం అభివృద్ధితోపాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రీడల వికాసానికి ఎంపీ అపూర్వ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం మంత్రులు, ఎంపీలు నిరంతరం కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి కావాల్సిన నిధులను సాధిస్తున్నారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విజయవాడ ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత గుర్తింపు రావడంతో విజయవాడకు మహర్దశ పట్టనుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ప్రాంతంతో పాటుగా విశాఖ, తిరుపతి, విజయవాడ నగరాల్లో క్రీడా వసతులు మెరుగవుతున్నాయని చెప్పుకొచ్చారు. విజయవాడ ఐజీఎంసీ స్టేడియాన్ని సుమారు రూ.185 కోట్ల వ్యయంతో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ వెల్లడించారు.టాలైన అధికారులు జిల్లా యంత్రాంగంలో ఉండటం ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి కీలకంగా మారిందని చెప్పుకొచ్చారు.
విజయవాడ ఐజీఎంసీ స్టేడియం అభివృద్ధిలో ఎంపీ కేశినేని శివనాథ్ పాత్ర అత్యంత కీలకమని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. దాని అభివృద్ధి కోసం సుమారు 20 సార్లు స్టేడియానికి వెళ్లి సూచనలు చేసినట్లు ఆయన చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ కోరినట్లుగా స్టేడియంలో ఓ బ్లాక్కు మహిళా క్రీడాకారిణి పేరు పెడతామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి స్టేడియం రూపు రేఖలు మారిపోనున్నాయని చెప్పుకొచ్చారు శాప్ చైర్మన్. వచ్చే సంవత్సరం ఓ అంతర్జాతీయ క్రీడాకారుడిని స్టేడియానికి తీసుకువచ్చి కార్యక్రమం చేపడతామని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్