
ఖమ్మం, 08 ఏప్రిల్ (హి.స.)
పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు
అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం పాలేరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఖమ్మం రూరల్ మండలం పోనేకల్ లో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్మాణ ప్రాంతాలను తిరుగుతూ పనుల నాణ్యతను, క్షేత్రస్థాయిలో భవనాల నమునా మ్యాప్ లను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల వద్ద లింక్, అంతర్గత రోడ్డు, విద్యుత్ సరఫరా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విద్యా వ్యవస్థలో ప్రపంచానికి పోటీ పడే విధంగా మన విద్యార్థులను తయారు చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలు, మౌళిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని భవిష్యత్తులో ఉత్తమమైన చదువు అందించే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించేందుకు సమీకృత విద్యా సంస్థలను ఏర్పాటు చేసే సంకల్పానికి అధికారులు సమన్వయంతో పని చేసి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా పరిధిలో ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు అయి నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు