
ఢిల్లీ, 08 ఏప్రిల్ (హి.స.)
మతాల్లో ఉన్న మూఢవిశ్వాలను ఎత్తి చూపే హక్కు తమకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మతవిశ్వాసాలపై న్యాయం వెల్లడించే హక్కు కూడా తమకు ఉన్నట్లు కోర్టు చెప్పింది. శబరిమల(Sabarimala Case) ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ రెండో రోజు కోర్టులో పలు కోణాల్లో ఆసక్తికర వాదనలు జరిగాయి. కేంద్రం చేసిన వాదనను సుప్రీం తిరస్కరించింది. జడ్జీలు న్యాయ రంగంలో మాత్రమే నిపుణులని, మతం అంశాల్లో కాదు అని, సాంప్రదాయాలపై సెక్యులర్ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించడం సరికాదు అని కేంద్రం పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ కేసులో వాదనలు వింటోంది.
విభిన్న మతస్తులు, వారి విశ్వాసాలపై కోర్టు విస్తృతంగా చర్చించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. మతంలోని మూఢవిశ్వాసాలపై కోర్టు ఎలా నిర్ణయాన్ని వెల్లడిస్తుందని ప్రశ్నించారు. మూఢ నమ్మక విధానమే ఉన్నా.. ఆ అంశాన్ని కోర్టు తేల్చలేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(2)(బీ) ప్రకారం ఆ పని చట్టసభ్యులు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఫలానా విధానం మూఢనమ్మకమైందని, దీనిలో చట్టసభ ద్వారా సంస్కరణలు చేపట్టవచ్చు అన్నారు. క్షుద్ర విద్యతో పాటు ఇతర విధానాల నివారణకు అనేక చట్టాలు ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంలో జస్టిస్ అమానుల్లా స్పందిస్తూ.. ఆ వాంగ్మూలం చాలా సింపుల్గా ఉందని, ఓ విధానం ఎంత వరకు మూఢవిశ్వాసమో చెప్పేందుకు కోర్టుకు హక్కు ఉందని, అది మా పరిధిలోకి వస్తుందన్నారు. ఆ తర్వాత చట్టసభ పరిధిలోకి వెళ్తుందన్నారు.
చట్టసభల్లో తీర్మానించిన అంశమే చివరిదని చెప్పలేరని, అలా జరగదు అని జస్టిస్ అమానుల్లా అన్నారు. మతపరమైన ఓ ప్రక్రియను మూఢనమ్మకంగా నిర్ణయించే హక్కు కోర్టుకు లేదని తుషార్ మెహతా అన్నారు. ఎందుకంటే ఆ కోర్టులో ఆ మతనిష్ణాతులు ఉండరన్నారు. చట్టం అంశాల్లో న్యాయమూర్తులే నిపుణులు అని, కానీ మతం అంశంలో కాదని ఆయన అన్నారు. నాగాలాండ్లో ఉన్న ఓ మతవిధానాన్ని తాను వ్యక్తిగతంగా ఓ మూఢనమ్మకంగా భావిస్తానని, మనమో విభిన్నమైన సమాజంలో ఉన్నామని, మహారాష్ట్రలో క్షుద్ర విద్యకు చెందిన చట్టం ఉందని, అయితే ఆ విద్య అక్కడ ప్రాచుర్యంలో ఉన్నట్లు వాళ్లు చెబుతారని, అందుకే ఆర్టికల్ 25(2)(బీ) ప్రకారం దాన్ని రక్షిస్తున్నట్లు తుషార్ మెహతా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi