
ఉత్తరాఖండ్, 08 ఏప్రిల్ (హి.స.)
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఓ మహిళ గంగానది తీరం వద్ద మద్యం తాగి హల్చల్ చేసింది. అడ్డుకున్న స్థానిక పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. నీలకంఠ మార్గంలో ఉన్న పూల్ ఛాటి ఏరియాలో ఈ ఘటన ఏప్రిల్ 6వ తేదీన జరిగింది. హర్యానాకు చెందిన ఓ మహిళ .. గంగానది ఘాట్ వద్ద మద్యం సేవించింది. పబ్లిక్గా మద్యం తాగవద్దు అని పోలీసులు వారించారు. కానీ ఆమె వారితో కొట్లాటకు దిగింది. గట్టిగా అరుస్తూ పోలీసుల మీదకు వెళ్లింది. మేం టూరిస్టులం, మేం వస్తేనే మీకు రోజు గడుస్తుందని ఆమె అరిచింది. స్వంత డబ్బులతో మద్యం సేవిస్తున్నానని, టూరిస్టులతో వ్యవహరించే తీరు ఇది కాదు అని ఆమె పేర్కొన్నట్లు వీడియోలో ఉంది. చివరకు ఆమె భర్త వచ్చి ఆ గొడవను ఆపాడు. ఆ మహిళ ప్రవర్తించిన తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi