
కర్నూలు, 09 ఏప్రిల్ (హి.స.)
కర్నూలులోని బిర్లాగడ్డకాలనీకి చెందిన పసుపుల కిరణ్ (17) దారుణహత్యకు గురయ్యాడు. కాలనీకి చెందిన సుజాత, జగత్గణేశ్ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. వీరి తండ్రి 15 ఏళ్ల కిందట చనిపోయాడు. తల్లి పలు ఇళ్లలో పాచి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మూడో కుమారుడైన కిరణ్ స్థానిక శ్రీగాయత్రీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివేవాడు. బుదవారం రాత్రి తన స్నేహితులైన బడేసాహెబ్, రాజారెడ్డి, వినయ్లతో కలిసి ముజఫర్నగర్లో ఓ స్నేహితుడి జన్మదిన వేడుకల విందుకు హాజరయ్యాడు. అక్కడి నుంచి అందరూ కృష్ణానగర్కు వెళ్లారు. అదే కాలనీలో చికెన్ దుకాణం నిర్వహించే అన్నదమ్ములైన అస్లామ్, ఇస్మాయిల్లతో వీరికి పాత గొడవలు ఉండటంతో వారి ఇంటికి వెళ్లారు. అన్నదమ్ములను బయటకు పిలిచి పాత విషయాలను లేవనెత్తి గొడవపెట్టుకున్నారు.
ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. అన్నదమ్ములిద్దరు బలంగా కొట్టడంతో కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్నేహితులను విచారించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కిరణ్ తల్లి ఫిర్యాదు మేరకు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అస్లాం, ఇస్మాయిల్లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ