
పరవాడ, 09 ఏప్రిల్ (హి.స.)
పైసా పైసా కూడబెట్టి చీటీలు కట్టిన ప్రజలను పరవాడ తాజా మాజీ ఉప సర్పంచి, వైకాపా నాయకుడు రామారావు దంపతులు కోట్లాది రూపాయిలు టోకరా పెట్టి కొద్ది నెలల క్రితం పరారయ్యారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు రామారావు దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరవాడ బీసీ కాలనీకి చెందిన బండారు రామారావు పరవాడ ఉప సర్పంచిగా పనిచేశారు. ఈయన భార్య లక్ష్మి స్థానిక అంగన్వాడీ కార్యకర్తగా పని చేసి కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. పదేళ్లుగా అనధికార చీటీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చీటీలను వేసేవారు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. ఈ క్రమంలో చీటీలు కట్టినవారు, అప్పులు ఇచ్చినవారు తమ డబ్బులు చెల్లించాలని అడుగుతుండడంతో ఇంటి నుంచి భార్యతో కలిసి పరారయ్యారు.
దీంతో గత నెల 28న గొర్లెవానిపాలెం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన బాధితురాలు మొలిచర్ల చిన్నమ్ములు తదితరులు చీటీల మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా రామారావు దంపతులను మంగళవారం రాత్రి విజయనగరం టౌన్లో అరెస్టు చేసి పరవాడ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధితులు బుధవారం పెద్దఎత్తున స్టేషన్కు చేరుకుని తమ గోడును సీఐకి చెప్పుకున్నారు. తొ. ఈ మేరకు రామారావు దంపతులను విశాఖ జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో వీరిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని సీ.ఐ మల్లికార్జునరావు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ