
బెంగళూరు 10 మే (హి.స.)
కర్ణాటక రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. నెలరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్.. బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మోకాలి ఆపరేషన్ క్రితం ఆయన కొద్దిరోజుల క్రితం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. సర్జరీ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో పరిస్థితి విషమించింది. ఏప్రిల్ 20న కిమ్స్ కు తరలించగా.. లైఫ్ సపోర్ట్ పైనే వైద్యులు చికిత్స అందించారు. ఊపిరితిత్తుల మార్పిడికి డాక్టర్లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో .. ఆయన కన్నుమూశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను.. సుధాకర్ తన రాజకీయ గురువుగా భావించేవారు. ఇద్దరూ మంచి సనిహితులు కూడా. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్ 2008లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2013, 2023 సంవత్సరాల్లో హిరియూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. సుధాకర్ మరణంపట్ల డీకే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..