మోదీపై అఖిలేశ్ మండిపాటు
మోదీపై అఖిలేశ్ మండిపాటు
AKHILESH YADAV


ఢిల్లీ, 11 మే (హి.స.)

దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఏడు విజ్ఞప్తులపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఈ ఏడు విజ్ఞప్తులతో కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరించినట్లు అయ్యిందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విజ్ఞప్తులు చేయడంపైనా కేంద్రానికి ప్రశ్నలు సంధించారు.

అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే సంక్షోభం అనే పదం గుర్తుకు వచ్చింది! నిజానికి దేశానికి ఉన్న సంక్షోభం ఒక్కటే. దాని పేరు భారతీయ జనతా పార్టీ (బీజేపీ). ఇన్ని ఆంక్షలు విధించాల్సి వస్తే ఐదు ట్రిలియన్ డాలర్ల జుమ్లా ఆర్థిక వ్యవస్థ అసలు ఎలా సాధ్యమవుతుంది? బీజేపీ ప్రభుత్వం చేతుల నుంచి పగ్గాలు పూర్తిగా జారిపోయినట్లు కనిపిస్తోంది. డాలర్ ఆకాశాన్ని అంటుతోంది. రూపాయి విలువ అగాధంలోకి పడిపోతోంది. బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న విజ్ఞప్తిని సాధారణ పౌరులకు కాకుండా తమ అవినీతిపరులైన మిత్రులకు మోదీ చేయాలి. ప్రజలు ఎలాగూ 1.5 లక్షల తులాల బంగారం కొనడం లేదు. బీజేపీ విధేయులు మాత్రమే తమ నల్లధనానికి బంగారు పూత పూయడంలో నిమగ్నమై ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ విజ్ఞప్తులను ఎందుకు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ వాళ్లు ప్రయాణించిన వేలాది చార్టర్ విమానాలు నీటితో ఎగిరాయా? వాళ్లు హోటళ్లలో బస చేయలేదా?. బీజేపీ తమ ఎన్నికల ప్రచారాన్ని కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయలేదు? ఈ ఆంక్షలన్నీ కేవలం ప్రజల కోసమేనా?. మాంద్యం లేదా ద్రవ్యోల్బణం వస్తుందనే భయాల కారణంగా ఇటువంటి విజ్ఞప్తులు వాణిజ్యం, వ్యాపారం, మార్కెట్లలో భయాన్ని, ఆందోళనను, అశాంతిని, నిరాశను వ్యాపింపజేస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande