ప్రధాని రాజీపడ్డారు..ఇకపై దేశాన్ని నడపలేరు..మండిపడ్డ రాహుల్
ప్రధాని రాజీపడ్డారు..ఇకపై దేశాన్ని నడపలేరు..మండిపడ్డ రాహుల్
Rahul Gandhi


న్యూఢిల్లీ, 11 మే (హి.స.)

పశ్చిమాసియా సంఘర్షణ వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజీపడ్డారని, ఇకపై దేశాన్ని నడపలేరని విమర్శించారు. ప్రధానమంత్రి వ్యాఖ్యలు వైఫల్యానికి నిదర్శనంగా అభివర్ణించారు. దేశ పాలన ఇకపై ప్రధాని చేతుల్లో లేదని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్టు పెట్టారు.

'నిన్న(ఆదివారం) ప్రధాని మోదీ ప్రజలను త్యాగాలు చేయమని పిలుపునిచ్చారు. బంగారం కొనవద్దు, విదేశాలకు వెళ్లవద్దు, పెట్రోల్ తక్కువగా వాడండి, ఎరువులు, వంట నూనె వాడకం తగ్గించండి, మెట్రోలో ప్రయాణించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి వంటి విజ్ఞప్తులను దేశ ప్రజలకు చేశారు. ఇవి సలహాలు కావు. వైఫల్యానికి నిదర్శనం. గత 12 ఏళ్లలో దేశం ఇప్పుడు ప్రజలకు ఏమి కొనాలి? ఏమి కొనకూడదు? ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడికి వెళ్లకూడదు? అని చెప్పాల్సిన దుస్థితికి చేరుకుంది. తన జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, మోదీ పదేపదే బాధ్యతను ప్రజలపైకి నెడుతున్నారు. రాజీపడిన ప్రధాని ఇకపై దేశాన్ని నడపగల సమర్థుడు కాదు' అని రాహుల్ గాంధీ తెలిపారు.

పెట్రోలియం ఉత్పత్తులను వివేకంతో వాడుకోవాలని పౌరులను కోరుతూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలై మూడు నెలలు గడిచినా దేశ ఇంధన భద్రతను నిర్ధారించడంపై ప్రధానికి దిక్కుతోచడం లేదని ఆరోపించింది. ఈ ప్రపంచ సంక్షోభం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కాకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించకుండా, ప్రధాని ప్రజలను అసౌకర్యానికి గురిచేయడం నిర్లక్ష్యపూరిత, అనైతికమైన చర్యగా అభివర్ణించింది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీపై విరుచుకుపడ్డారు.

దేశాన్ని మరింత బలంగా, ఆత్మనిర్భరంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఏడు విజ్ఞప్తులను దేశ ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం డిమాండ్ చేశారు. ఈ విజ్ఞప్తులను ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన చాలా తీవ్రమైన ఆదేశాలుగా అభివర్ణించారు. ఈ విజ్ఞప్తులను చేయడానికి దారితీసిన వాస్తవ పరిస్థితుల గురించి తమకు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు కార్తీ చిదంబరం ఎక్స్లో పోస్ట్ పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande