
బెంగళూరు , 12 మే (హి.స.)2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున టీటీ రాజేగౌడ, బీజేపీ తరఫున జీవరాజ్లు పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల కౌంటింగ్ తరువాత 201 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి టీటీ రాజేగౌడ గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే.. జీవరాజ్ ఈ ఫలితాన్ని సవాలు చేశారు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు రీకౌంటింగ్కు ఆదేశించింది.
రిటర్నింగ్ అధికారి 562 ఓట్లను పునః పరిశీలించి బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపొందినట్టుగా ప్రకటించారు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. విషయం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు తీరును తప్పుపట్టింది. ఫలితాలను మార్చేసి కాంగ్రెస్ అభ్యర్థే శృంగేరి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే అని స్పష్టం చేసింది.
క్రిమినల్ కేసును విస్మరించారు...
హైకోర్టు తీర్పు ఒకలా.. సుప్రీంకోర్టు తీర్పు ఇంకోలా ఉండేందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే.. రీకౌంటింగ్ సందర్భంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హైకోర్టు ఆదేశాలను మించి 562 ఓట్లను రీకౌంట్ చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ నెల రెండు మూడు తేదీల్లో రీకౌంటింగ్ జరగ్గా 279 ఓట్లకు బదులు 562 ఓట్లు రీకౌంట్ చేశారు. ఫలితంగా టీటీ రాజేగౌడకు పడ్డ ఓట్లు 248- 255 వరకూ తగ్గిపోయి జీవరాజ్ ఓట్లు స్వల్పంగా పెరిగాయి. సుమారు 52 - 66 ఓట్ల తేడాతో జీవరాజ్ గెలిచినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
అంతకు ముందు అంటే 2023 ఎన్నికల కౌంటింగ్ సందర్భంలోనూ తమకు పడ్డ బ్యాలెట్లను ఉద్దేశపూర్వకంగా చెల్లనివిగా చేశారని టీటీ రాజేగౌడ ఆరోపిస్తున్నారు. బ్యాలెట్ కాగితాలపై గీతలు పెట్టి, ఇంకు గుర్తులు పెట్టి చెల్లకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ తలుపుల తాళాలు, సీళ్లు చెదిరిపోయి ఉన్నాయని కూడా గుర్తించారు. కౌంటింగ్కు ముందే బ్యాలెట్ బాక్సులు తెరిచి ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలపై అప్పట్లోనే కలెక్టర్ కె.ఎన్.రమేశ్, రిటర్నింగ్ అధికారి వేదమూర్తి, బీజేపీ అభ్యర్థి జీవరాజ్లపై కేసులు కూడా నమోదయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ