
చెన్నై12 మే (హి.స.)తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వానికి అన్నాడీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు సంకేతంగా మారింది. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఈ అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించింది. బుధవారం అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల సహకారంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు షణ్ముగం నేతృత్వంలోని 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం తోడవడంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతంగా తయారైంది.
తాజాగా చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో షణ్ముగం మాట్లాడుతూ.. ప్రజలు విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, ఆ ప్రజా తీర్పును గౌరవిస్తూనే తాము టీవీకే ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అదే సమయంలో పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) తీరుపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని ఎన్నికలుగా అన్నాడీఎంకే వరుస ఓటములను చవిచూస్తోందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ