
హైదరాబాద్, 13 మే (హి.స.)
హిందూయిజం అనేది జీవన విధానమని, ఈ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి గుడికి వెళ్లడం లేదా పూజలు చేయడం తప్పనిసరేం కాదని తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. హిందూయిజంపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుందని తేల్చి చెప్పింది. కేరళలోని శబరిమల ఆలయం సహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లతో పాటు దావూదీ బోహ్రాలతో సహా పలు మతాలు పాటించే మత స్వేచ్ఛ పరిధిపై విచారణ జరిపే క్రమంలో బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి కూడా ఉన్నారు.
శబరిమల ఆలయ ప్రవేశ తీర్పు - పునస్సమీక్ష పిటిషన్లపై విచారణ
శబరిమల ఆలయ ప్రవేశ తీర్పును 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని 4:1 మెజారిటీతో ఆనాడు సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చింది. 2018 నాటి ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పునస్సమీక్ష పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. దీనిపై తమ వాదనలను కూడా వినాలంటూ పలువురు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విచారణలో భాగంగా 15వ రోజున (బుధవారం) మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన ఒక పక్షం తరఫున అడ్వకేట్ డాక్టర్ జి. మోహన్ గోపాల్ వాదనలు వినిపించారు.
ఇప్పుడందరూ వేదాలను అంగీకరిస్తున్నారా?
హిందూ మతంలోని పలు వర్గాల నుంచే సామాజిక న్యాయం కోసం డిమాండ్ వస్తోంది. హిందూయిజాన్ని ఒక మత వర్గంగా నిర్వచించారు. మతం, తత్వశాస్త్రానికి సంబంధించిన అన్ని విషయాల్లో వేదాలను అత్యున్నత ప్రమాణంగా అంగీకరించేవాడే హిందువు అని 1966లో తీర్పు ఇచ్చారు. హిందువులందరి అభిప్రాయాలను తీసుకోకుండానే గతంలో కోర్టులు ఈవిధంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. హిందువుల్లో ఎవ్వరూ ఎప్పుడూ అలా చెప్పలేదు. నాకు వేదాల పట్ల అత్యంత గౌరవం, గొప్ప ఆరాధనా భావం ఉన్నాయి. కానీ, నేడు హిందువులుగా వర్గీకరించిన ప్రతి ఒక్కరూ అన్ని ఆధ్యాత్మిక, తాత్విక విషయాల్లో వేదాలను అత్యున్నత ప్రమాణంగా అంగీకరిస్తున్నారు అన్నది వాస్తవమేనా? అని మధ్యంతర పిటిషన్ దాఖలుచేసిన ఒక పక్షం తరఫున అడ్వకేట్ డాక్టర్ జి. మోహన్ గోపాల్ సుప్రీంకోర్టులో వాదన వినిపించారు.
అందుకే హిందూ మతాన్ని జీవన విధానం అంటారు
ఈ వాదనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ, ‘‘అందుకే హిందూ మతాన్ని ఒక జీవన విధానం అంటారు. ఒక హిందువు హిందువుగా ఉండటానికి తప్పనిసరిగా గుడికి వెళ్లడం గానీ, ఏదైనా ఆచారం పాటించడం గానీ అవసరం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆచారబద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ విశ్వాసాన్ని కలిగి ఉండటానికి ఎవరూ అడ్డు రాలేరు’’ అని జస్టిస్ నాగరత్న తెలిపారు. ఒక వ్యక్తి హిందూ మత విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి, గుడిసెలో దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుంది అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈసందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi