
గుంటూరు జిల్లా,: 15 మే (హి.స.)
గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న బేతస్థ ప్రార్థనా మందిరంలో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భోజన వసతులు కల్పించారు. అయితే నిన్న (గురువారం) రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని ఈరోజు (శుక్రవారం) కొందరు తిన్నారు. ఆహారం పాడై ఉండటంతో తిన్న కాసేపటికే పలువురు అస్వస్థతకు గురయ్యారు.
విషమంగా ఆరుగురి ఆరోగ్యం..
ఆహారం తిన్న కొద్ది గంటల్లోనే పలువురికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఒక్కసారిగా గ్రామంలో పలువురు అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో బాధితులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ