
విశాఖ, 16 మే (హి.స.)
: జిల్లాలోని ఆనందపురం మండలం, రామవరం రెవెన్యూ గ్రామంలో గ్రావెల్ క్వారీలో జరుగుతున్న భారీ బ్లాస్టింగ్లతో సమీప రామవరం, గండిగుండం గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 8 ఏళ్ల కిందట గ్రావెల్ తవ్వుకోవడానికి అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు రాయిని వెలికి తీయడానికి ప్రభుత్వ అనుమతులు లేకుండానే క్వారీలో పేలుళ్లు నిర్వహిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రతిరోజూ జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా ఇళ్ల గోడలు కంపించడం, ధూళీ, కాలుష్యం పెరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. పేలుళ్ల సమయంలో పెద్ద శబ్దాలు రావడంతో చిన్నారులు, వృద్ధులు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో రాళ్లు ఎగిరిపడుతున్నాయని.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమ బ్లాస్టింగ్ను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ