
, 16 మే (హి.స.)
కృష్ణా జిల్లా,
:ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈరోజు(శనివారం) మచిలీపట్నం రైతు బజార్ ప్రాంగణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. గ్రామ వార్డు, సచివాలయాల వారీగా ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్ధాలను, ప్రజలకు జరిగే నష్టాలను వివరించాలని.. దీనిపై సమగ్ర అవగాహనతో ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ అవసరం: కొనకళ్ల నారాయణ
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ.. ఒక్కో బస్సు ధర సుమారు రూ.1.60 కోట్ల నుంచి రూ. 1.70 కోట్ల వరకు ఉందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి బస్సులను కొనుగోలు చేయడం ప్రస్తుతానికి ఆర్టీసీకి, ప్రభుత్వానికి సాధ్యం కాని పనిగా చెప్పుకొచ్చారు. దీనికి బదులుగా బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తే.. వారే పెట్టుబడులు పెట్టి బస్సులను నడుపుతారన్నారు. దీనివల్ల ఆర్టీసీపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ