
నాగర్ కర్నూల్, 16 మే (హి.స.)
గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభి వృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల పరిధిలోని సర్వారెడ్డిపల్లి తాండ సమీపంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీలోని ఆధునిక యంత్రాలు, ప్రాసెస్సింగ్ విభాగాలు, ఉత్పత్తి విధానాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. సంస్థ నిర్వాహకు లతో సమావేశమై నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ విధానాలు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రైతులకు కూడా మేలు జరుగుతుందని అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ యాజమాన్యానికి సూచించారు. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు