
హైదరాబాద్, 16 మే (హి.స.)
నగరంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో
ఒకటైన మలక్పేట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కాంట్రాక్టర్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్లాట్ఫారంల సదుపాయాల మెరుగుదల, ప్రయాణికుల నిరీక్షణ మందిరాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, పారిశుధ్య సౌకర్యాలు, స్టేషన్ ప్రవేశ ద్వారాల విస్తరణ వంటి పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతుండటాన్ని గమనించిన ఆయన, కాంట్రాక్టర్ను మందలిస్తూ నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సంబంధిత రైల్వే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రతి పని ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు వినియోగించే మలక్పేట్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తయితే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీతో పనులు మరింత వేగం పుంజుకుంటాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు