భోజ్శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పులాంటిదే: అసదుద్దీన్ ఒవైసీ
భోజ్శాల తీర్పు బాబ్రీ మసీదు తీర్పులాంటిదే: అసదుద్దీన్ ఒవైసీ
bhojshala


హైదరాబాద్, 16 మే (హి.స.)

మధ్యప్రదేశ్లోని భోజ్శాల-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని ఆలయంగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలి ఉందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ తీర్పు పూర్తిగా తప్పులతో కూడుకున్నదని, అనేక ప్రాథమిక వాస్తవాలను న్యాయస్థానం విస్మరించిందని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒవైసీ మాట్లాడారు. బాబ్రీ మసీదు కేసులో మాదిరిగానే 'ఆస్థ' (నమ్మకం) ఆధారంగానే ఈ తీర్పు కూడా వెలువడిందని ఆయన విమర్శించారు. బాబ్రీ మసీదు కేసులో ముస్లింల ఆధీనంలో స్థలం లేదని కోర్టు చెప్పింది. కానీ భోజ్శాల విషయంలో మాత్రం శుక్రవారం వరకు ముస్లింల ఆధీనంలోనే ఉంది. అక్కడ ముస్లింలు 700 ఏళ్లుగా నమాజ్ చేస్తున్నారు అని ఆయన గుర్తుచేశారు.

బాబ్రీ మసీదు తీర్పు వెలువడినప్పుడే తాను ఒక విషయం చెప్పానని, 'ఆస్థ' ఆధారంగా ఇచ్చే తీర్పులు ఇలాంటి మరిన్ని వివాదాలకు తలుపులు తెరుస్తాయని హెచ్చరించానని ఒవైసీ అన్నారు. రెండు కేసుల్లో ఇచ్చిన ఊరట కూడా ఒకే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు రాజ్యాంగ విలువలకు అనుగుణంగా లేదని, ఒక మతం హక్కులను హరిస్తూ మరో మతానికి అనుకూలంగా తీర్పులివ్వడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

చారిత్రక ఆధారాలను విస్మరించారని ఆరోపిస్తూ 1935 నాటి ధార్ స్టేట్ గెజిట్, 1985 నాటి వక్ఫ్ రిజిస్ట్రేషన్, ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం-1991 వంటి కీలక అంశాలను కోర్టు పట్టించుకోలేదు. ఈ వాస్తవాలన్నింటినీ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను అని ఒవైసీ తెలిపారు. 1951లోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇది మసీదు అని, ఇక్కడ కేవలం ముస్లింలు మాత్రమే నమాజ్ చేసుకోవాలని, ఇతర మతాల ప్రార్థనలకు అనుమతి లేదని ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన వివరించారు.

అసలు అది ఆలయం కాదని, రాజా భోజ్ సంస్కృత విద్యను ప్రోత్సహించిన ఒక 'గురుకులం' అని శాసనాలు చెబుతున్నాయని ఒవైసీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేవాలయం అని మనం పార్లమెంట్ను పిలుస్తాం. అంతమాత్రాన అది పూజలు చేసే స్థలం కాదు. అలాగే అదీ ఒక గురుకులం మాత్రమే అని ఆయన పోల్చారు.

ఈ కేసులో పిటిషనర్లతో నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఏఎస్ఐ కుమ్మక్కయ్యాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 12లను ఉల్లంఘించడమేనని ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. 1995లో ధార్లోని కొందరు ముస్లిం పెద్దలు మసీదులో మంగళవారం, బసంత్ పంచమి రోజుల్లో పూజలకు అనుమతిస్తూ ఒప్పందం చేసుకోవడం చారిత్రక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande