
విజయనగరం, 19 మే (హి.స.)
విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి. ఈ భారీ వలసలు స్థానిక రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పార్టీ మారిన నాయకులకు, కార్యకర్తలకు విజయనగరం శాసనసభ్యురాలు పూససాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన సభ్యులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమయ్యామని, టీడీపీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే తామంతా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
చేరికల అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో టీడీపీ గ్రాఫ్ను మరింత పెంచేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలను తీర్చడమే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని వ్యాఖ్యానించారు. నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే ప్రతి కార్యకర్తకూ, నాయకుడికీ పార్టీలో ఖచ్చితంగా తగిన గుర్తింపు, గౌరవం దక్కుతాయని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ