
హైదరాబాద్, 19 మే (హి.స.)
అవినీతి అధికారుల వేటలో యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్ (GM) కుమార్ను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
మల్లాపూర్ పరిధిలో ఉన్న జలమండలి జీఎం కుమార్ సొంత నివాసంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. తెల్లవారుజామున 6 గంటలకే జీఎం ఇంటికి చేరుకున్న ప్రత్యేక బృందాలు, ఎవరూ బయటికి వెళ్లకుండా, లోపలికి రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాయి. కేవలం జీఎం కుమార్ నివాసంలోనే కాకుండా, ఆయనకు సంబంధించిన కీలకమైన నెట్వర్పై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే సన్నిహితులు, బంధువుల ఇళ్లలో.. మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు.
ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో.. ఇప్పటి వరకూ ఏసీబీ అధికారులు రూ.100 కోట్ల ఆస్తుల్ని గుర్తించారు. నిజామాబాద్ లో మూడెకరాల భూమి, హైదరాబాద్ లో మూడు ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. ఆయన ఇంటిలో నిర్వహించిన సోదాల్లో రూ.1.10 కోట్ల నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఈ అవినీతి తిమింగలం బాగోతం తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..