
హైదరాబాద్, 19 మే (హి.స.)
తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. పోలీసు తదితర యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గరిష్ఠ వయో పరిమితిని పదేళ్ల పాటు సడలించారు. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది.
నిరుద్యోగుల హర్షం : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ఠ వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచటాన్ని హర్షిస్తూ మంగళవారం ఓయూలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగ జేఏసీ డాక్టర్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలో నిరుద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సుమారు 40 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi