
అమరావతి, 20 మే (హి.స.)
విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థుల మాస్ కాపీయింగ్ ఘటనపై తుది నివేదికను కమిటీ సిద్ధం చేసింది. వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన 21 మంది విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. నివేదికను పరిశీలించిన అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ చర్యలు తీసుకోనున్నారు.
ఏప్రిల్ 2 నుంచి యూజీ మెడికల్, పీజీ మెడికల్, ఆయుష్, డెంటల్ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, స్లిప్పుల ద్వారా మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డారు. అయితే, పరీక్షల నేపథ్యంలో 28 మెడికల్, 9 డెంటల్, 7 ఆయుష్ కళాశాలల్లో 540 కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. వాటిని విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు.
పరీక్షల్లో కాపీ కొడుతున్న విషయాన్ని కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు గుర్తించారు. వెంటనే ఇన్విజిలేటర్లను అప్రమత్తం చేసి కాపీయింగ్ చేస్తున్న విద్యార్థులను పట్టుకున్నారు. దీనిపై నిజనిజాలు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేయగా.. తాజాగా 21 మందిపై చర్యలకు సిఫార్సు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ