
జనగామ, 20 మే (హి.స.)
జనగామ పట్టణ కేంద్రంలోని ప్రముఖ బతుకమ్మ కుంట ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం సందర్శించారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, యువకులు మార్నింగ్ వాక్కు వచ్చే ఈ ప్రాంగణంలో ఉన్న వసతులు, సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ మార్నింగ్ వాక్ చేస్తున్న స్థానిక వాకర్స్తో కలిసి నడుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బతుకమ్మ కుంట ప్రాంగణంలో ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ ఎమ్మెల్యేను కోరారు. దీనివల్ల యువత, మహిళలు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అలాగే ప్రాంగణంలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
వాకర్స్ తెలిపిన సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. బతుకమ్మ కుంట ప్రాంగణం నుంచే మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం బతుకమ్మ కుంట వద్ద అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని,
వాకర్స్ కోరినట్లుగా త్వరలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు