
అనంతపురం, 20 మే (హి.స.)
వేసవి కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర తాగునీటి సంక్షోభం నెలకొంది. శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తుండటంతో సుమారు 500 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆరు నెలలుగా పేరుకుపోయిన బకాయి వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు చేపట్టిన ఈ ఆందోళన రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఒకపక్క మండుతున్న ఎండలు, మరోపక్క చుక్క నీరు అందక 500 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత రెండు వారాలుగా పథకం ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.
సీఎం ఆదేశించినా.. కదలని దస్త్రం
కార్మికుల ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ కూడా సానుకూలంగా స్పందించి, రూ. 11 కోట్ల మేర కార్మికుల వేతనాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆదేశాలు ఉండి, నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రాష్ట్రస్థాయిలో అధికారుల వద్ద వేతనాలకు సంబంధించిన దస్త్రం (ఫైలు) ముందుకు కదలకపోవడం గమనార్హం.
కార్మికుల ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. ఆయా ప్రాంతాల్లోని సత్యసాయి తాగునీటి పథకం కేంద్రాల వద్ద ప్రతిరోజూ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల జీతాలను తక్షణమే తమ ఖాతాల్లో జమ చేయాలని, అప్పటివరకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించేది లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV