
తిరుమల , 20 మే (హి.స.)
కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో స్వామివారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని ఉచిత దర్శనం (సర్వదర్శనం) కొరకు వేచి ఉన్న భక్తుల లైన్లు వెలుపలికి వచ్చి, సుదూరంగా ఉన్న శిలాతోరణం వరకు చేరుకుంది.
ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లలోకి వెళ్లే ఉచిత సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. అలాగే, రూ. 300 శీఘ్రదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుండగా, ముందస్తుగా సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4 నుండి 6 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారి హుండీ ద్వారా లభించిన నగదు కానుకల ఆదాయం రూ. 3.74 కోట్లుగా నమోదైనట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV