
గిద్దలూరు, , 21 మే (హి.స.): మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు, ట్రైబల్ వాచర్ల సహాయంతో తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందిన సమాచారం మేరకు ఓ గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లోని సొమ్ము స్వాహా చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు తురిమెళ్ళ అటవీ క్షేత్ర స్థాయి అధికారులు.. ట్రైబల్ వాచర్లతో కలిసి గుట్టుగా గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఓ రెండు పెద్ద మట్టి కుండలు బయటపడగా అందులో వజ్రాలు, బంగారం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దొరికిన బంగారం, వజ్రాలను తొలుత హైదరాబాద్లో అమ్మేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో బెంగళూరులో అటవీశాఖ అధికారులు అమ్ముకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సమాచారం గురించి అటవీశాఖ అధికారులను మీడియా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు స్పందించడం లేదు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV