క్యూలైన్ మూసివేత.. తిరుమలకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
క్యూలైన్ మూసివేత.. తిరుమలకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
తిరుమల


తిరుమల, 21 మే (హి.స.)

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. విద్యాసంస్థలకు మరికొద్దిరోజుల్లో వేసవి సెలవులు ముగియనుండటంతో.. శ్రీవారి దర్శనానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వరుసగా పరీక్షల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో.. శ్రీవారికి మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ సర్వదర్శనం క్యూ లైన్ ను టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తిరిగి రాత్రి 8 గంటల నుంచి క్యూలైన్లోకి భక్తులను అనుమతించగా.. గురువారం ఉదయం 7 గంటల సమయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో ఫుల్ అయిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ భక్తులు క్యూలైన్లో స్వామివారి దర్శనానికి బారులు తీరారు.

కొన్నిగంటలపాటు సర్వదర్శనం క్యూలైన్ మూసివేయడంతో.. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రస్తుతం క్యూలైన్లో ఉన్నవారికి శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. . భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు సమకూరిందని టీటీడీ తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ కోరింది. కొండపై అన్నపానీయాలకు లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande