
తిరుమల, 29 మే (హి.స.)
: భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తెలిపింది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను తితిదే ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులోకి తీసుకొస్తోంది. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తోంది. ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ సదుపాయం 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుందని తితిదే తెలిపింది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారని.. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొంది. కాగా ఈ విధానం జూన్ 10 నుంచి అమలులోకి రానుంది. ఈ కోటాలో బుకింగ్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో ఇస్తామని పేర్కొంది. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తితిదే వెల్లడించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ