
భూపాలపల్లి, 29 మే (హి.స.) సరస్వతి అంత్య పుష్కరాల
సందర్భంగా విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వారు కాళేశ్వరానికి విచ్చేసి సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. తదుపరి అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులకు, భక్తులకు ఆశీర్వచనం చేశారు. ఆలయం తరఫున స్వామివారి శేష వస్త్రాలతో మహారాజ్ స్వామీజీకి అందించారు. రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం తరుపున శాంతి కుమారికి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సలహాదారు గోవింద హరి, ఆలయ ఈవో మహేష్, చేర్మెన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
గురువారం సాయంత్రమే కాళేశ్వరం చేరుకున్న విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీకి ఆలయ ఈవో మహేష్ మరియు అర్చక బృందం ఘనంగా స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద నిర్వహించిన సరస్వతి నవరత్న మాల హారతిని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి వీక్షించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ చాలా గొప్ప రోజున పరమశివుడికి పరమ ప్రీతి అయినా రోజు త్రయోదశి రోజున సాయంత్రం ప్రదోష కాలమున పరమశివుడికి అత్యంత ఇష్టమైన రోజున మనం హారతి చూడడం మన భాగ్యమని పేర్కొన్నారు. పుష్కర స్నానం చేస్తే అదృష్టం మరియు భాగ్యం కలుగుతుందని తెలిపారు. ఆ భగవతి అమ్మ అనుగ్రహం ఏమో కానీ ఈ ప్రదోషకాలంలో మాస శివరాత్రి నాడు స్నానం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..