ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం.. మోకాళ్లపై నిలబడి రైతన్నల నిరసన
ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం.. మోకాళ్లపై నిలబడి రైతన్నల నిరసన
Farmers


నిర్మల్, 29 మే (హి.స.) నిర్మల్ జిల్లా

బోథ్ నియోజకవర్గంలోని సొనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నాయకులు, అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా శుక్రవారం రైతులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం తరలించడంలో అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాల్లోకి ధాన్యం తీసుకుని వచ్చి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తరలించడంలో మాత్రం విఫలమవుతున్నారన్నారు.

మొన్నటి వరకు గన్ని సంచుల కొరత, తూకం అయ్యాక లారీల కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాత్రం ఫొటోలకు ఫోజులు ఇస్తూ ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. మరో వారం రోజుల్లో రుతుపవనాలు రానున్నాయని పొలాల్లో దుక్కులకు గతి లేదని రాబోవు ఖరీఫ్ సీజన్ లో రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎకరాకు జొన్నలు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తే కేవలం 10 క్వింటాళ్లు కొనుగోలు చేయడం ఏమిటని మిగతా 20 క్వింటాళ్ల జొన్నలను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. గతంలో 14 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తే ఈసారి పది క్వింటాలు కొనుగోలు చేయడం వారి అసమర్థతకు నిదర్శనమని అన్నారు. తక్షణమే నాయకులు, అధికారులు కల్పించుకొని ధాన్యాన్ని తరలించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande