
సూర్యాపేట, 29 మే (హి.స.)
రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం సిఐటియు పట్టణ సెక్రటరీ ఎం. ముత్యాలు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు ఎండలు, వానలు లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ సరైన వేతనాలు, సమయానికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రెండు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..