
భీమవరం 30 మే (హి.స.)
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో జాతీయ పరీక్ష ఏజెన్సీ (ఎన్టీఏ) తీరు వివాదాస్పదమైంది. అదే ఎన్టీఏ జాతీయ స్థాయిలో నిర్వహించే మరో ప్రవేశ పరీక్ష కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ-2026 నిర్వహణలో కూడా లోపాలు తలెత్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎన్నార్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ సైన్స్ పరీక్ష పలుమార్లు నిలిచిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం సెషన్లో 3 గంటలకు జరగాల్సిన పరీక్షకు 2.30 గంటల వరకు అభ్యర్థులను లోపలికి అనుమతించారు. తీరా పరీక్ష ప్రారంభం నుంచి సాంకేతిక సమస్యలతో అంతరాయం కలుగుతూనే ఉంది. రెండు సబ్జెక్టులు రాయల్సిన వారికి 5 గంటలకు, మూడు సబ్జెక్టులు రాయాల్సిన వారికి 6 గంటలకు పరీక్ష ముగుస్తుంది. అవాంతరాల మధ్య చివరకు పరీక్షను ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు ముగించారు.
దేశవ్యాప్తంగా ఒకే సమయంలో జరిగే పరీక్ష భీమవరంలో 9 గంటల వరకు సాగడాన్ని పరిగణలోకి తీసుకుంటారా? అనే దానిపై అభ్యర్థులు, తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అవాంతరాల వల్ల పరీక్ష కూడా సరిగా రాయలేక పోయామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన సీయూఈటీ పరీక్షలు భీమవరం కేంద్రంలో పలు అవాంతరాల మధ్య సాగాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు నష్టపోతే ఎన్టీఏ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ