దేశంలో నైరుతి రుతుపవనాలు- ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షాలు: ఐఎండీ
దేశంలో నైరుతి రుతుపవనాలు- ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షాలు: ఐఎండీ
Rain Kerala


ఢిల్లీ, 30 మే (హి.స.)

ఈ ఏడాది దేశంలో కురిసే నైరుతి రుతుపవనాల వర్షపాతం, దీర్ఘకాలిక సగటులో 90 శాతంగానే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో ఈశాన్య భారతంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానున్నట్లు IMD పేర్కొంది. నైరుతి రుతుపవనాల సీజన్కు సంబంధించి ప్రకటించిన రెండో ముందస్తు అంచనాలో ఈ వివరాలను IMD వెల్లడించింది. ఏప్రిల్ 13న విడుదల చేసిన మొదటి అంచనాలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 92 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పుడు ఆ అంచనాలను మరికాస్త తగ్గించడంతో రాబోయే రోజుల్లో వర్షభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలను IMD పంపింది.

వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జూన్- సెప్టెంబర్ రుతుపవన కాలంలో దేశం దీర్ఘకాలిక సగటు(LPA) వర్షపాతంలో 90 శాతం వర్షాన్ని అందుకునే అవకాశం ఉంది. దీనికి ఎర్రర్ మార్జిన్ నాలుగు శాతంగా ఉంది అని తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రాంతీయ అంచనాల ప్రకారం, ఈశాన్య భారతదేశంలో దీర్ఘకాల సగటులో 94 నుంచి 106 శాతం మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, వాయువ్య భారతదేశం, రుతుపవనాల ప్రధాన సమయంలో ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ నెల అంచనాలను అందిస్తూ, దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, దీర్ఘకాల సగటులో 92 శాతం కంటే తక్కువగా ఉంటుందని మృత్యుంజయ్ తెలిపారు.

మరోవైపు, జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. మధ్య, వాయువ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని మృత్యుంజయ్ అన్నారు. ఉత్తర్ప్రదేశ్ , హర్యానా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లలో సాధారణం కంటే ఎక్కువగ వడగాలుల వీచే అవకాశం ఉంటుందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. మహారాష్ర్టా, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కూడా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సముద్ర పరిస్థితులపై మృత్యుంజయ్ మాట్లాడుతూ, తటస్థ ఈఎన్ఎస్ఓ పరిస్థితులు ఎల్నినో వైపు మారుతున్నాయని తెలిపారు. జూన్ నాటికి ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 82 శాతంగా ఉందని, జూలై, ఆగస్టు నాటికి 90 శాతానికి పైగా పెరుగుతుందని అన్నారు. రుతుపవన కాలమంతా తటస్థ హిందూ మహాసముద్ర ద్విధ్రువ(ఐఓడీ) పరిస్థితులు కొనసాగుతాయని చెప్పారు.

ఇదిలా ఉండగా, జాతీయంగా మే నెలలో వర్షపాతం సాధారమం కంటే నాలుగు శాతం అధికంగా నమోదైందని ఐఎండీ తెలిపింది. మే 27 వరకు నమోదైన మొత్తం రుతుపవన వర్షపాతం సాధారణం కంటే ఒక శాతం అధికంగా ఉందని మృత్యుంజయ్ పేర్కొన్నారు. సాధారణంగా రుతుపవనాలు ప్రారంభమయ్యే తేదీ కంటే నాలుగు రోజుల ముందుగానే, మే 16న అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని ఆయన తెలిపారు. అప్పటి నుంచి అవి దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలోకి విస్తరించాయని, వచ్చే వారంలోగా కేరళ, ఈశాన్య రాష్ర్టాల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే పశ్చిమ ఆటంకాలు, తూర్పు గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వాయువ్య భారతదేశం అంతటా తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని, అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande