
పంజాబ్, 30 మే (హి.స.)
పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సత్తా చాటింది. ఇటీవల కీలక నేతలు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన నేపథ్యంలో ఈ గెలుపు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద ఊరటనిచ్చింది. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఐదింటిని ఆప్ కైవసం చేసుకొని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఫలితాలు 2027 అసెంబ్లీ ఎన్నికలకు సంకేతం కాకపోయినా, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
శుక్రవారం వెలువడిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లలో మొహాలీ, బర్నాలా, బటాలా, మోగా, బటిండాలను ఆప్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా కపుర్తలాలో విజయం సాధించగా, బీజేపీ కేవలం అబోహర్కే పరిమితమైంది. పఠాన్కోట్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక అన్ని కార్పొరేషన్లలలోనూ కలిపి మొత్తం 1,977 వార్డులకు గాను ఆప్ 954 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 390, స్వతంత్రులు 251, శిరోమణి అకాలీదళ్ (SAD) 191, బీజేపీ 170 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. 75 మున్సిపల్ కౌన్సిళ్లలో 45 చోట్ల ఆప్ జెండా ఎగురవేసింది.
సీఎం భగవంత్ మాన్ ఈ విజయంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ నాలుగేళ్ల అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని అన్నారు. బీజేపీని ‘ఈడీ పార్టీ’గా అభివర్ణిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి మా నేతలను భయపెట్టాలని చూశారు. కానీ పంజాబ్ ప్రజలు బెదిరింపులకు లొంగరని ఈ ఫలితాలతో రుజువు చేశారు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఫలితాలను చూసి ఆప్ అతిగా సంబరపడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కుల్దీప్ సింగ్ ఈ విషయంపై స్పందించారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది, కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అలాగే 2015లో స్థానిక ఎన్నికల్లో గెలిచిన అకాలీదళ్, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది అని ఆయన గుర్తుచేశారు. స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఆధారంగా జరిగే ఈ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలను అంచనా వేయడానికి ప్రామాణికం కాదని స్పష్టం చేశారు.
మరోవైపు, శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా, కాంగ్రెస్ నాయకులు అధికార ఆప్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi