
ప్రొద్దుటూరు , 30 మే (హి.స.)
ఆర్యవైశ్య సమాజాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన యాక్టివిస్టు పంచ్ ప్రభాకర్పై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ నాయకులు ఈ రోజు శనివారం డిమాండ్ చేశారు. స్థానిక అమ్మవారి శాలలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బుశెట్టి రామ్మోహన్ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ద్వేషపూరిత ప్రచారాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఆర్యవైశ్య సమాజం శతాబ్దాలుగా వ్యాపార, సేవా రంగాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుని సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటుందని నాయకులు గుర్తు చేశారు. అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, వైద్య సేవలు, పేదల వివాహాలు, సామూహిక కళ్యాణ కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. అలాంటి సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేయడం అసహనానికి గురిచేస్తోందన్నారు.ఆర్యవైశ్య ప్రముఖుడు టీజీ వెంకటేశ్వర్లు మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మరింత బాధాకరమని నాయకులు పేర్కొన్నారు. టీజీ వెంకటేశ్వర్లు కులమతాలకు అతీతంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ అనేక పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజ సేవలో నిమగ్నమైన వ్యక్తులపై వ్యక్తిగత విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు.
రాజకీయ విమర్శలు వేరు, కుల సంఘాలను కించపరచడం వేరు అని స్పష్టం చేసిన నాయకులు, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అనవసర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో సమాజాల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV